పెళ్లి పేరుతో మోసం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు!

  • పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ యువతి ఆరోపణలు
  • పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో కేసు నమోదు
  • మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నామన్న వైద్య విద్యార్థిని
  • పెళ్లి పేరుతో నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణ
  • తన ఎదుగుదలను చూసి కుట్ర చేస్తున్నారన్న పోరెల్
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న యువ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్ వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు.

మగ్రా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు, ఆమె తల్లి మంగళవారం సంయుక్తంగా ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా పోరెల్‌తో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, పెళ్లి హామీతో శారీరకంగా దగ్గరయ్యామని మెడికల్ విద్యార్థిని అయిన ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇప్పుడు అతను మాట తప్పాడని, దీనిపై నిలదీయడంతో తనపై దాడి చేసి బెదిరించాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు, అయితే, ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.

ఈ ఆరోపణలను అభిషేక్ పోరెల్ పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న అతడు మీడియాతో మాట్లాడుతూ.. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశాడు. తాను క్రికెట్‌లో రాణిస్తుండటాన్ని చూసి ఓర్వలేకనే కొందరు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నాడు. ఈ విషయంపై పోలీసులు తనను ఇంకా సంప్రదించలేదని, చట్టపరంగానే దీనిని ఎదుర్కొంటానని స్పష్టం చేశాడు. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలతో ముందుకొస్తానని తెలిపారు.

Abhishek Porel
Delhi Capitals
Marriage cheating case
IPL player controversy
West Bengal police
Cricket news

More Telugu News